రికవరీ సొమ్మును బాధితులకు అప్పగింత
3రోజులలో ట్రేస్ చేసి గుర్తించిన కర్నూలు 4వ పట్టణ పోలీసులు
6 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలు, రూ.12 వేల నగదును బాధితులకు అప్పగించిన సీఐ మధుసూదన్ గౌడ్
సీఐ మధుసూదన్ గౌడ్, స్టేషన్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ
కర్నూలు క్రైమ్, నవంబర్ 24, (సీమకిరణం న్యూస్)
ఓ కేసులో రికవరీ చేసిన సొమ్మును బాధితులకు అప్పగించామని కర్నూలు నాలుగో పట్టణ సీఐ మధుసూదన్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం కర్నూల్ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ మధుసూదన్ గౌడ్ వివరాలు వెల్లడించారు. 6 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలు, రూ.12 వేల నగదును బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న నంద్యాల జిల్లా, సున్నిపెంట గ్రామానికి చెందిన కాత రామిరెడ్డి, అతని భార్య సున్నిపెంట నుండి కర్నూలు ఒక వివాహ కార్యక్రమముకు హాజరు అయ్యి, తిరిగి సున్నిపెంట కు వెళ్తూ కర్నూలు బస్టాండ్ లో బస్సు ఎక్కగా, వారికి చెందిన ఒక బ్యాగ్ కర్నూలు బస్టాండ్ లో మర్చిపోయి వెళ్ళినామని, అందులో విలువైన బంగారు, వెండి అభారణములు కలవని కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాదవ్ ఉత్తర్వుల మేరకు కర్నూలు నాల్గవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్, సిబ్బందిని ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేశారు. బ్యాగ్ కొరకు కర్నూలు బస్టాండ్ లో సీసీటీవీలను పరిశీలించి, పిర్యాదుదారుడి బ్యాగ్ ను 3రోజులలో ట్రేస్ చేసి గుర్తించామన్నారు. బాధితులు కాత రామిరెడ్డిని స్టేషన్ కు పిలిపించి సొమ్మును, నగదును అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు నాల్గవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్, స్టేషన్ సిబ్బందిని కర్నూలు జిల్లా ఎస్పీ జి . బిందు మాధవ్ అభినందించారు.