ప్రకృతి సౌందర్యం కలిగిన పర్యాటక ప్రాంతం విజయవనం
రూ.1.4 కోట్లతో విజయవనం అభివృద్ధి
కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు ప్రతినిధి, నవంబర్ 27, (సీమకిరణం న్యూస్) :
ప్రకృతి సౌందర్యం కలిగిన పర్యాటక ప్రాంతం..విజయవనం (పుల్లయ్య పార్క్) అని,రూ.1.4 కోట్లతో విజయవనం అభివృద్ధి చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం కర్నూలు నగర శివార్లలోని వెంకన్న బావి దగ్గర గల విజయవనం (పుల్లయ్య పార్క్) లో జిల్లా అటవీ శాఖ అధికారి శ్యామల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయవనం పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారుతోందన్నారు. విజయవనం రూ.1.4 కోట్లతో అభివృద్ధి జరుగుతోందని, ప్రస్తుతం కోటి రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో రూ.40 లక్షలతో యోగా పార్క్, పిల్లల ఆటలు ఆడే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.. ఈ పార్కు ను పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తెలిపారు. పట్టణీకరణ నేపథ్యంలో అటవీ ప్రాంతం తగ్గిపోతోందని, అటవీ శాఖ ఆధ్వర్యంలో నగర వనాలను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు.. ప్రజలు సెలవు సమయాలలో కాలుష్య ప్రాంతాలకు దూరంగా ఉన్న ఇలాంటి ప్రాంతాలకు వచ్చి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. నిత్యం పని ఒత్తిడితో గడిపే అధికారులకు మానసిక ప్రశాంతత కూడా అవసరమన్నారు. అధికారులు ఒత్తిడి ని అధిగమించి, మరింత ఉత్సాహంగా పని చేసేందుకు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతగానో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. పర్యాటకులు ప్రకృతి సౌందర్యం కలిగిన విజయవనాన్ని సందర్శించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఆట,పాటలతో ఉల్లాసంగా గడిపిన అధికారులు
నిత్యం పని ఒత్తిడి తో ఉండే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు కాసేపు వాటిని మర్చిపోయి ఆట,పాటలతో ఉల్లాసంగా గడిపారు.., మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, వాలీ బాల్ ఆటల్లో పాల్గొన్నారు..జిల్లా కలెక్టర్ టగ్ ఆఫ్ వార్, వాలీ బాల్ ఆటల్లో, జాయింట్ కలెక్టర్ మ్యూజికల్ చైర్స్ లో అధికారులతో కలిసి ఆడారు.. టగ్ ఆఫ్ వార్, వాలీ బాల్ ఆటల్లో కలెక్టర్ టీం గెలుపొందింది.. తొలుత కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విజయ వనంలో మొక్కలు నాటారు. అనంతరం ఉసిరి చెట్టు వద్ద పూజాదికాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, జడ్పీ సీఈవో నాసర రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ రామచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఏపీ ఎం ఐ పి పిడి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.