చిన్న మల్కాపురం గ్రామంలో తల్లిదండ్రుల – ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం
కర్నూలు ప్రతినిధి / డోన్, డిసెంబర్ 07, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 7న జరిగిన తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం డోన్ మండలం దొంతి రెడ్డి చిన్న సుబ్బారెడ్డి ఉన్నత పాఠశాల చిన్న మల్కాపురం గ్రామంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ మెగా కార్యక్రమానికి అధికారులు, గ్రామ సర్పంచ్, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు, దాతలు , పూర్వ విద్యార్థులు, వైద్య సిబ్బంది, విద్యార్థుల తల్లితండ్రులు తదితరులు హాజరయ్యారు. తరగతి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో వారి పిల్లల చదువు గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించారు. విద్యార్థి సమగ్ర అభివృద్ధికి సంబంధించిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును తల్లిదండ్రులకు అందించారు. విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు మరియు తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యు. సత్యనారాయణ పాఠశాల ప్రగతి గురించి తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థులు మంచి ప్రగతిని సాధించడానికి తన ఉపాధ్యాయ బృందంతో కలిసి కృషి చేస్తానని తెలిపారు . పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం విద్యార్థులను ప్రతిరోజు పాఠశాలకు పంపి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి కృషి చేయవలసిందిగా తల్లితండ్రులను కోరారు. స్థానిక చిన్న మల్కాపురం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చెన్నకేశవులు విద్యార్థులకు ఆరోగ్య అవగాహనను కల్పిస్తూ మంచి ప్రగతిని సాధించాలంటే మంచి ఆరోగ్యం యొక్క అవసరాన్ని విద్యార్థులకు తెలిపారు. మహిళా పోలీస్ మల్లిక సైబర్ నేరాల గురించి మరియు డ్రగ్స్ మాదకద్రవ్యాల దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు సమాజానికి సందేశాన్నిచ్చే నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేశారు.