డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంపొందించుకోవాలి : జేసీ వేణుగోపాల్‌రెడ్డి
ఫోటో : వినియోగదారుల రక్షణ చట్టం ‘జనం’ ప్రత్యేక సంచికను విడుదల చేస్తున్న జెసీ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
విశాఖపట్నం కలెక్టరేట్, కలెక్టరేట్, మార్చి 15, ( సీమకిరణం న్యూస్) :
డిజిటల్ లావాదేవీల్లో భధ్రత, సమాచార రక్షణ, భరించగలిగే రీతిలో వ్యవహారాల నిర్వహణలపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని జాయింట్ కలక్టర్ (ఆర్.బి, ఆర్) ఎం.వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తన చాంబర్లో మంగళవారం వినియోగదారుల రక్షణ చట్టం తీర్పులు, ప్రభుత్వ ఉత్తర్వులు, వినియోగదారుల వ్యవహారాలపై ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జనం మాసపత్రిక ముద్రించిన ప్రత్యేక సంచికను ఆయన విడుదల చేశారు. అనంతరం వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మారుతున్న మార్కెట్ సవాళ్ల మధ్య వినియోగదారుని హక్కుల రక్షణకు ఆర్థిక సంస్థలు ఏయే ప్రమాణాలు పాటించాలో ముందుగా నిర్దేశితం కావాలన్నారు. డిజిటల్ ఆర్థిక యుగంలో పురుషులతో పోల్చితే స్త్రీలు ముఖ్యంగా గ్రామీణ మహిళలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై అవగాహనలో వెనకబడి ఉన్నారన్నారు. మహిళలకు అవగాహన పెంచి వివిధ వెబ్‌సైట్లు, యాప్‌లు, వాట్సాప్ గ్రూప్‌లు, ఫే˜స్‌బుక్, టెలిగ్రాం, మెసెంజర్, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా మహిళలు డిజిటల్ లావాదేవీల్లో ముందంజ వేసేలా వినియోగదారుల ఉద్యమకర్తలు, స్వచ్ఛంద సంస్దలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్త వినియోగదారుల రక్షణ చట్టంతో వినియోగదారుల హక్కులకు భంగం కలిగించే శక్తులను నియంత్రించవచ్చని జెసీ వేణుగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారులు రొంగలి శివ ప్రసాద్, జి.సూర్యప్రకాశరావు, జిల్లా యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యనిర్వహణాధికారి పి.నాగేశ్వరావు, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం యువజన అధికారి జి.మహేశ్వరావు, కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, జనం మాస పత్రిక అసోసియేట్ ఎడిటర్ కాండ్రేగుల వెంకటరమణ, వినియోగదారుల ఉద్యమకర్తలు వై.రవిశంకర్, బొడ్డేడ జగ్గఅప్పారావు తదితరులు పాల్గొన్నారు.