
సుందరీకరణను పాడు చేస్తే కఠిన చర్యలు
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
కర్నూలు కార్పొరేషన్, జూన్ 03, (సీమకిరణం న్యూస్):
నగరంలో కూడళ్లపై, డివైడర్లపై, ప్రభుత్వ ఆస్తులపై, గోడలపై, పోస్టర్లు, బ్యానర్లు అతికించినా, రాతలు రాసినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు మరోసారి హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ప్రధాన కూడళ్లలపై, డివైడర్ల మధ్యలోని స్తంభాలపై, గోడలపై బ్యానర్లు, ప్రైవేటు సంస్థల, సినిమా పోస్టర్లు అతికించడం, రాతలు రాయడం కారణంగా లక్షలాది ప్రజాధనంతో చేపట్టిన సుందరీకరణ పాడు అవుతుందని, కావున రాజకీయ పార్టీలు, మతపరమైన సంస్థలు, ఇతర ప్రైవేటు సంస్థలు నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు. దీనిని ఎవరైనా అతిక్రమించి నగర సుందరీకరణకు పాడు చేస్తే, వారిపై మున్సిపల్ కౌన్సిల్ సి.ఆర్.నెం: 78 ప్రకారం భారీ జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.