
పక్కా కొలతలతో ఆస్తి పన్ను మదింపు
• ప్రతి షాపు వద్ద రెండు చెత్త కుండీలు తప్పనిసరి
• నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ
కర్నూలు కార్పొరేషన్, జూన్ 05, (సీమకిరణం న్యూస్):
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మాణాలకు అనుగుణంగా ఆస్తి పన్ను మదింపునకు ఇంటింటి సర్వే చేపట్టి పక్కా కొలతలను తీస్తున్నామని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ అన్నారు. మంగళవారం ఆయన కొండారెడ్డి సమీపంలోని వెంకట చలపతి షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఆస్తి పన్ను మదింపు సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇబ్బడిముబ్బడిగా కట్టడాలు ఉన్నాయని, నిర్మాణ విస్తీర్ణం తక్కువగా చూపించి పన్ను చెల్లించడం, పట్టణ ప్రణాళిక విభాగంలో అనుమతి లేకుండా నిర్మాణాలు ఉండటం వంటి లోపాలను సరి చేసి పన్ను మదింపు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 15 లోపు ప్రక్షాళన చేసి, దాదాపు రూ.15 కోట్ల ఆదాయం నగరపాలకకు సమకూరుస్తామన్నారు. అదేవిధంగా ప్రతి వాణిజ్య షాపు వద్ద రెండు చెత్తకుండీలు తప్పనిసరిగా ఉండాలని, లేనిచో సంబంధిత షాపు ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని అదనపు కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు రాజు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.