
జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు గట్టిగా కృషి చేయాలి
కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు కలెక్టరేట్, నవంబర్ 15, (సీమకిరణం న్యూస్) :
జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు గట్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో బాల్య వివాహాల నిర్మూలన,వరకట్న నిషేధం అంశంపై సంబంధించి జిల్లా కలెక్టర్ ఆర్డీవోలు,పోలీస్ అధికారులు, ఎన్జీవో లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్యవివాహలపైన విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎడ్యుకేషన్, పోలీస్,స్త్రీ శిశు సంక్షేమ శాఖలతో పాటు ఎన్జీవో లు ఈ అంశంలో కీలకంగా పని చేయాలన్నారు. పాఠశాలల్లో 8 వ తరగతి నుండి 10 వ తరగతి లో ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులు బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను గురించి పూర్తిగా వివరించాలని చెప్పామని, అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి కూడా పిల్లలకు చెప్పాలని సూచించామని, కలెక్టర్ తెలిపారు. బాల్య వివాహాలు చేస్తే వచ్చే అనర్థాల గురించి తల్లిదండ్రులకు కూడా వివరించాలని కలెక్టర్ సూచించారు. సచివాలయంలో మహిళా పోలీస్ ద్వారా బాల్యవివాహాలు జరుగుతున్న అంశంపై వివరాలు సేకరించి, గ్రామ స్థాయి కమిటీలు ఫాలో అప్ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. వరకట్న నిషేధ చట్టం -1961 అమలు పై చర్చిస్తూ, ఎక్కడెక్కడ కేసులు ఎక్కువగా రికార్డు అయ్యాయని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్, ఎమ్మిగనూరు, కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఎక్కువగా కేసు లు రికార్డు అయ్యాయని ఐసిడిఎస్ పిడి తెలిపారు. వరకట్నం చట్టవిరుద్ధం అయినప్పటికీ, ప్రస్తుత కాలంలోనూ కొనసాగడం పట్ల కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు..ఈ ఈ అంశంలో తల్లిదండ్రుల్లో మార్పు రావాలని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, కర్నూలు, ఆదోని ఆర్.డి.ఓ లు అజయ్ కుమార్, సందీప్ కుమార్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, , ఐసీడీఎస్ పిడి విజయ, NGO లు పాల్గొన్నారు.




