
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు కల్పిస్తాం
187 టిడ్కో ఇళ్ల పంపిణీలో మంత్రి టీజీ భరత్
టిడ్కో గృహాల పూర్తికి రూ.18 కోట్లు విడుదల
10 వేల ఇళ్ల పనులు మార్చి 31 నాటికి పూర్తి చేస్తాం
అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం
పరిశ్రమలతో యువతకు ఉద్యోగావకాశాలు
కర్నూలు టౌన్, నవంబర్ 17, (సీమకిరణం న్యూస్):
ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు ఇస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ. భరత్ పేర్కొన్నారు. సోమవారం జగన్నాథగట్టు వద్ద ఉన్న ఎన్టీఆర్ కాలనీలో నిర్మాణాలు పూర్తైన టిడ్కో గృహాలను మంత్రి, ఎమ్మెల్యేలు గౌరు చరితరెడ్డి, బొగ్గుల దస్తగిరి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పంపిణీ చేశారు. ముందుగా నూతన గృహాలను ప్రారంభించి లబ్దిదారులను శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2,61,040 టిడ్కో గృహాలు ఉండగా, వాటిలో 1.40 లక్షల గృహాలు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇందులో కర్నూలులోనే 10 వేల ఇళ్లు ఉండటం, మిగిలిన వాటి పూర్తి కోసం రూ.18 కోట్లు మంజూరు కావడం మన ప్రాంతానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత అని చెప్పారు. 976 ఇళ్లలో తొలుత 187 ఇళ్లను ఇస్తున్నామని, మొత్తం 40 వేల మంది ఇక్కడ నివాసాలు ఏర్పడితే ఈ ప్రాంతం చిన్న పట్టణంలా మారుతోందనీ వివరించారు. నివాసాలు అధికంగా ఉండడమే సౌకర్యాల వేగవంతమైన అందుబాటుకు దోహదం అవుతుందని, పోలీస్ ఔట్‌పోస్ట్, యూ-టర్న్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొదట ఎంతోకొంత ప్రారంభిద్దామని అనుకొని రూ.1 కోటి అవసరం అవుతాయని భావించామని, మంత్రి నారాయణతో మాట్లాడగా ఏకంగా రూ.6 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి, అనంతరం అవసరాన్ని బట్టి రూ.18 కోట్లు ఏకంగా మంత్రి నారాయణ మంజూరు చేయించారని తెలిపారు. కాంట్రాక్టర్లు ఆలస్యం చేయకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. సమీపంలోనే పరిశ్రమలు రావడంతో స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగనున్నాయని అన్నారు. కొందరు ప్రజల్లో తప్పుడు దావాలు పుట్టించడానికి ప్రయత్నిస్తున్నా, ప్రజలు వాటిని పట్టించుకోరాదని సూచించారు. . మన ప్రాంతం వెనకబడి ఉండటంతో పరిశ్రమలను తెచ్చేందుకు పరిపాలన శ్రద్ధగా పనిచేస్తోందని, బుధవారపేట షాపుల సమస్యను కూడా సామరస్యంగా పరిష్కరించామని తెలిపారు. ఔట్‌పోస్ట్, అర్బన్ హెల్త్ సెంటర్, స్కూల్ ఏర్పాటు చేస్తూ, ఇళ్లు పొందిన ప్రతి ఒక్కరూ ఇక్కడే నివసించేందుకు వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి మాట్లాడుతూ.. 2017లో చంద్రబాబు టిడ్కో గృహాలను ప్రారంభించారని, ఎన్నో ఏళ్ల తర్వాత పేదలకు ఇళ్లు అందుతున్న రోజు వచ్చిందని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక 18 కోట్లు మంజూరు చేసి అన్ని వసతులను కల్పించడంతో మార్చి 31లోపు 976 ఇళ్లను అందించగలమని అన్నారు. మంత్రి టీజీ భరత్ అవ్వడం ప్రాంతానికి అదృష్టమని, ఓర్వకల్లు మండలంలో పరిశ్రమలు రావడంతో 13 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. 20 లక్షల టార్గెట్ కాకుండా 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే దిశగా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. విదేశాల నుంచి కోట్ల పెట్టుబడులు తెస్తూ అభివృద్ధికి మార్గం సుగమం చేస్తున్న టీజీ భరత్‌ను అభినందించారు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని, గత 17 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 92 వేల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. టిడ్కోలో అన్ని వసతులతో పేదలకు అనువైన గృహాలు నిర్మాణం జరుగుతున్నాయని చెప్పారు. కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న టిడ్కో గృహాలను ఈ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. గత ప్రభుత్వం వీటిని నాశనం చేసినప్పటికీ, మంత్రి టీజీ భరత్ అహర్నిశలు కృషి చేయడంతో మంత్రి నారాయణతో మాట్లాడి రూ.6 కోట్లు, తరువాత అవసరమైన మొత్తాన్ని కూడా మంజూరు చేయించారని చెప్పారు. జిల్లాకు పరిశ్రమలు భారీగా వస్తుండటం, నగరంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రహదారి విస్తరణలు వేగంగా సాగుతుండటం ప్రాంత అభివృద్ధికి పెద్ద ఊతమని తెలిపారు. పరిశ్రమలతో యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని అన్నారు. కమిషనర్ పి.విశ్వనాథ్ మాట్లాడుతూ.. 976 ఇళ్లలో తొలుత 187 ఇళ్లు అందజేస్తున్నామని, మిగిలిన గృహాలను పూర్తయ్యే వెంటనే ప్రతి వారం హ్యాండోవర్ చేస్తామని తెలిపారు. నిర్మాణాలు అత్యుత్తమ నాణ్యతతో, కొత్త టెక్నాలజీతో, ఎటువంటి అవాంతరాలు లేకుండా జరుగుతున్నాయని చెప్పారు. ప్రజాప్రతినిధుల సహకారంతో రాష్ట్ర స్థాయి అధికారులతో సమన్వయం చేయడంతో పనులు వేగంగా పూర్తవుతున్నాయని వివరించారు. రవాణా, తాగునీటి సరఫరా, రహదారులు, రేషన్, పెన్షన్, విద్యుత్, డ్రైనేజీ వంటి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తూ, లబ్దిదారులు ఇళ్లలో నివసించడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వమ్మ, బొందిలి కార్పొరేషన్ విక్రమ్‌సింగ్, బ్రహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.కే శ్రీనివాసరావు, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ తోళ్ళ మంజూనాథ్, ఏపి ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బోయ రామాంజనేయులు, టిడ్కో ఎస్‌ఈ నాగమోహన్, ఎంఈలు సూర్యనారాయణ, గుప్తా, అధికారులు పెంచలయ్య, మధు, కార్పొరేటర్లు పరమేష్, కైప పద్మలత, తదితరులు పాల్గొన్నారు.




