
గుండ్రేవుల ప్రాజెక్టు సాధనకై కదిలి రావాలి
కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.శ్రీహర్ష
• 24న రైతులు, యువత, విద్యార్థులతో భారీ ర్యాలీ
• 48 గంటలపాటు జల సమర దీక్ష
కర్నూలు ప్రతినిధి, నవంబర్ 22, (సీమకిరణం న్యూస్):
దేశంలోనే అత్యంత వెనుకబడిన మన ప్రాంతానికి జీవనాడైన గుండ్రేవుల ప్రాజెక్టు సాధనకై ఈ నెల 24న జరగనున్న ‘జల సమర దీక్ష’కు జిల్లా నలుమూలల నుండి ప్రజలు, రైతులు, యువత, విద్యార్థులు విస్తృతంగా కదిలి రావాలని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.శ్రీహర్ష పిలుపునిచ్చారు. శనివారం బిర్లా కాంపౌండ్‌లోని కేపిఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచినా, జిల్లాల నుండి హేమాహేమీలైన నేతలు ప్రాతినిధ్యం వహించినప్పటికీ దారిద్ర్య రేఖ కంటే దిగువననే ప్రజలు జీవనం సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా జిల్లావాణిని బలంగా వినిపించే సమయం వచ్చిందని చెప్పారు. ఈ నెల 24న ఉదయం 9:30 గంటలకు రాజ్ విహార్ ఆర్టీసీ పాత డిపో నుండి ధర్నా చౌక్ వరకు రైతులు, యువత, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం 48 గంటల జల సమర దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు ఆహ్వానాలు పంపినట్లు వెల్లడించారు. మన ప్రాంత అభ్యున్నతికి పార్టీ భేదాలు అన్నింటిని పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని శ్రీహర్ష కోరారు. ఈ కార్యక్రమంలో సినియర్ ప్రొఫెసర్ మన్సూర్ రహేమాన్, నౌషాద్, శ్రీనివాసులు, రామాంజనేయులు, ప్రేమ్, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.




