పశ్చిమ ప్రాంత అభివృద్ధికి సమగ్ర నివేదికలు రూపొందించండి
పశ్చిమ ప్రాంత అభివృద్ధికి సమగ్ర నివేదికలు రూపొందించండి
సమస్యల మూలాలను అన్వేషించి అభివృద్ధికి బాటలు వేయండి
జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు
కర్నూలు కలెక్టరేట్, మార్చి 16,( సీమకిరణం న్యూస్) :
జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఆదోని డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిందని… ఇందుకు సంబంధించి తమ తమ శాఖల్లో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకా అదనంగా ఏమి చేస్తే వెనుకబాటుతనం నుంచి ముందుకు తీసుకురావచ్చో సంబంధిత అంశాలపై స్థిరమైన, ఉన్నతమైన ఆలోచనలతో సమగ్ర నివేదికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పై సామాజిక ఆర్థిక పరిస్థితుల బృందం, సంబంధిత జిల్లా అధికారులతో సమావేశం జరిపారు. ఈ సమావేశంలోజాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) మనజీర్ జిలాని సామూన్, జాయింట్ కలెక్టర్(ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య,సెస్ ప్రొఫెసర్ లక్ష్మణరావు, డ్వామా పిడి అమరనాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలలో జీవనోపాధి నిమిత్తం పేద ప్రజలు వలస బాట పట్టడం, కరువు కాటకాలతో పంటలు సరిగా పండక పోవడం, తాగునీరు, ఇతర మౌలిక వసతులు లేకపోవడం తదితర కారణాల వల్ల ఆదోని డివిజన్ అత్యంత వెనుకబడి ఉందని… అన్ని ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారిని స్పెషల్ అధికారిగా నియమించిందన్నారు. ఇందుకు సంబంధించి అన్ని శాఖలు తమ తమ పరిధిలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఇరిగేషన్ తదితర అన్ని శాఖలు వెనుకబాటు తనానికి ఉన్న కారణాలను అన్వేషించి వాటిని అధిగమించేందుకు తీసుకోవలసిన చర్యలపై పటిష్ట నివేదికలను తయారు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి సామాజిక ఆర్థిక పరిస్థితుల సర్వే బృందం కొంతవరకు డేటాను సేకరించిందని అభివృద్ధి ప్రణాళికపై సంబంధిత బృంద సభ్యులు కోరినప్పుడు తక్షణమే స్పందించి తయారుచేసిన నివేదికలను ఇవ్వడంతోపాటు సంబంధిత అధికారులకు సహకరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మూలాలను అన్వేషించి… అక్కడి నుండి అభివృద్ధికి బాటలు వేసుకుంటూ… అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటూ వినూత్నమైన ఆలోచనలతో సైంటిఫిక్ గా ముందుకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని రెగ్యులర్ గా కాకుండా స్థిరమైన, ఉన్నతమైన ఆలోచనలతో ఏ విధంగా అభివృద్ధి చేస్తే వెనుకబాటు తనం నుంచి ముందుకు రావడానికి క్రేజీగా ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయం చేసుకుని ఆదోని డివిజన్ అభివృద్ధికి సహకరించాలన్నారు. కన్వర్జెన్స్ మోడ్ ను దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్డ్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డిఆర్డిఎ పిడి వెంకటేశులు, డిపిఓ నాగరాజు నాయుడు, పరిశ్రమల శాఖ జి ఎం సోమశేఖర్ రెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.