వచ్చే నెల 2వ తేది నంద్యాల జిల్లా కేంద్రం నుండి కార్యకలాపాలు
వచ్చే నెల 2వ తేది నంద్యాల జిల్లా కేంద్రం నుండి కార్యకలాపాలు కొనసాగాలి
ఈనెల 25వ తేదీలోగా కార్యాలయ భవనాలు ఇతర మౌలిక వసతులు సమకూర్చుకోవాలి
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు
కర్నూలు కలెక్టరేట్, మార్చి 16,( సీమకిరణం న్యూస్) :
వచ్చే నెల 2 ఉగాది నంద్యాల కొత్త జిల్లాలో అన్ని కార్యాలయాల అధికారులు కార్యకలపాలు కొనసాగించాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు జిల్లా అధికారులను నియమించారు. బుధవారం కలెక్టర్ సమావేశ భవనంలో నూతన జిల్లా ఏర్పాటుకు సంబంధించి కార్యాలయాల ఏర్పాటు, మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) ఎస్.రామసుందర రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి.శ్రీనివాసులు, డిఆర్వో పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతన జిల్లాగా ఏర్పాటైన నంద్యాలలో ఈ నెల 25వ తేదీలోగా అన్ని శాఖలు డివిజన్‌లో ఉన్న తమ కార్యాలయాలను అనుసంధానం చేసుకొని అన్ని మౌలిక వసతులు సమకూర్చుకోవాలన్నారు. వచ్చే నెల 2వ తేది ఉగాది నుండి నూతన జిల్లా అయిన నంద్యాల కార్యాలయం నుండి అన్ని కార్యాలయాల కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. ముందుగానే వెళ్లి కార్యాలయాలకు తగిన భవనాలు, ఫర్నిచర్ ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలన్నారు. సమస్యల కొరత, ఫర్నీచర్ వంటి అంశాల్లో ఏవైన ఇబ్బందులు ఎదురైతే అంతర్గత శాఖలతో సంప్రదించి సమన్వయం చేసుకొని భవనాలను సమకూర్చుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం నుండి ఎప్పుడైనా ఉత్తర్వులు రావచ్చని ఎలాంటి పరిస్థితులోనైనా పనిచేయటానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) ఎస్. రామసుందర రెడ్డి మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖలో అనేక భవనాలు ఉన్నాయని జిల్లా కేంద్రానికి స్థలాలు, భవనాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డిని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ వెంకట సుబ్బయ్య, డిపిఓ నాగరాజు నాయుడు, డిఆర్డీఏ పిడి వెంకటేశులు, డ్వామా పిడి అమర్‌నాథ్ రెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం సోమ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.