భూముల రీ సర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా చేపట్టాలి
భూముల రీ సర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా చేపట్టాలి
వీడియో కాన్ఫరెన్స్ లో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్
కర్నూలు కలెక్టరేట్, మార్చి 17, ( సీమకిరణం న్యూస్) :
అన్ని జిల్లాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం కింద చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా చేపట్టాలని సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం, ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ పై కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్లతో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థజైన్ లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల రీ సర్వే వేగంగా చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా డ్రోన్ సర్వే, సెక్షన్ 13 నోటిఫికేషన్, ఓ ఆర్ ఐ ఇమేజ్ లు, ఆర్ఓఆర్, పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు మొదలైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.