బయో వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలి

ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్పత్రుల బయో వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలి :-
బయో మెడికల్ వ్యర్థాలపై ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి అవగాహన కల్పించండి :-
భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం ఇచ్చేందుకు సామాజిక బాధ్యతగా కృషి చేద్దాం :-
బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ కర్నూలు జిల్లాలో బాగా జరుగుతుందని… అన్ని జిల్లాలు, రాష్ట్రాలు మన వైపు చూసేలా శాస్త్రీయంగా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ జరగాలి :-
ఆ దిశగా సామాజిక బాధ్యతతో అందరం కలిసి కట్టుగా కృషి చేద్దాం :-
బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, 2016 పై జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు :-
కర్నూలు కలెక్టరేట్, మార్చి 17, ( సీమకిరణం న్యూస్) :
జిల్లాలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్పత్రుల బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు అధికారులను ఆదేశించారు. గురువారం బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, 2016 పై జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశాన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల నిర్వాహకులతో జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రులలో బయో వ్యర్థ పదార్థాల నిర్వహణ సరిగా అమలు చేయకపోతే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని ఇవ్వలేని వాళ్లమవుతామని, అందరూ భాగస్వామ్యం అయ్యి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ మేల్కొని జాగ్రత్తగా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచనలను తప్పక పాటిస్తూ జిల్లాలో పక్కాగా బయో వ్యర్థాల నిర్వహణ జరగాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో బయో వ్యర్థ పదార్థాల నిర్వహణకు అవసరమైన ట్రీట్‌మెంట్, ట్రాన్స్పోర్ట్ అన్ని పటిష్టమైన చర్యలు ఉండేలా చూడాలన్నారు. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి బయోమెడికల్ వ్యర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ కర్నూలు జిల్లాలో బాగా జరుగుతుందని…అన్ని జిల్లాలు, రాష్ట్రాలు మన వైపు చూసేలా శాస్త్రీయంగా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ జరగాలని, ఆ దిశగా సామాజిక బాధ్యతతో అందరం కలిసి కట్టుగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. బయో మెడికల్ వేస్ట్ వల్ల మానవుల పై ప్రభావం చూపకుండా ఉండేందుకు జాగ్రత్తగా ప్రాపర్ గా ట్రీట్మెంట్, ట్రాన్స్పోర్ట్, డిస్పోజల్ చేయాలన్నారు. అందులో భాగంగా కిమ్స్, ఓమ్ని, మెడికవర్, శాంతిరాం తదితర ప్రైవేటు ఆసుపత్రులలో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ ఎలా జరుగుతుందో హాస్పిటల్ యాజమాన్య నిర్వాహకులతో జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వ్యర్థాలు సేకరించి వీటిని ఎక్కడకు తరలిస్తున్నాయి, ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నదీ పరిశీలించి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సమావేశంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ బి.వై ముని ప్రసాద్, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పి.జిక్కి, జి జి హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర నాథ్ రెడ్డి, బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ, యం/ఎస్ మెడికల్ వేస్ట్ సొల్యూషన్స్ జె.నరేష్, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్య నిర్వాహకులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.