23న విజయవాడలో రైతు గర్జన బహిరంగ సభ

23న విజయవాడలో రైతు గర్జన బహిరంగ సభ కరపత్రాల ఆవిష్కరణ
కడప కలెక్టరేట్, మార్చి19, ( సీమకిరణం న్యూస్) :
రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 23న రైతుల చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కడప జిల్లా కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి తెలిపారు విజయవాడలోని ధర్నాచౌక్ లో జరుగుతున్న రైతు గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని శుక్రవారం రైతు సంఘం జిల్లా కార్యాలయంలో రైతు గర్జన కరపత్రాలను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రైతు గర్జన బహిరంగ సభకు రైతు సంఘాల జాతీయ నాయకులు వస్తున్నారని చెప్పారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ ఉద్యమానికి తలవంచి కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసినా రైతాంగానికి ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయకుండా మోసగించిందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల గ్యారెంటీ చట్టం వెంటనే తేవాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు కనీస ధరలు కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు వెంటనే ఆపాలన్నారు. భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలన్నారు. జిల్లాలో వెంటనే శనగలు మినుములు పెసలు కందులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి కొనుగోలు చేయాలని కోరారు. అన్ని పంటలకు పంటల బీమా పథకం వర్తింపజేయాలని, కమతం ప్రాతిపదికన పంటల బీమా పరిహారం అందించాలన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 23 జరుగుతున్న రైతులు విజయవాడ రైతు గర్జన బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అందుకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేపడుతున్నట్టు ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు నాగ బసిరెడ్డి గోపాలకృష్ణయ్య కోటి రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు