వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు : తెదేపా అగ్రనాయకులు

మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తి పై పోక్సో కేసు నమోదు చేయాలి
– మైనర్ బాలికకు 25లక్షల నష్ట పరిహారం, ఉద్యోగం ఇవ్వాలి
– వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
– ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తెదేపా బృందం డిమాండ్
ప్రొద్దుటూరు, మార్చి 18, ( సీమకిరణం న్యూస్) :
ప్రొద్దుటూరు పట్టణంలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికను మోటర్ బైక్ పై తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసిన వ్యక్తి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి, తెదేపా కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, తెదేపా ప్రొద్దుటూరు నియోజకవర్గ బాధ్యుడు గండ్లూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, తెదేపా తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మల్లెల లక్ష్మీ ప్రసన్న లు డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగింది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రొద్దుటూరు లో చికిత్స పొందుతుoదని తెలిసి శుక్రవారం మధ్యాహ్నం తెదేపా అగ్రనాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే మైనర్ బాలిక డిశ్చార్జి కావడంతో ఆస్పత్రి ఆవరణలో తెదేపా నాయకులు విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బిసి లకు రక్షణ కరువైందని అన్నారు. జగన్ సర్కార్ లో చట్టం చేయని “దిశ” చట్టం తెచ్చి మహిళలను మభ్యపెడుతున్నారని వారు విరుచుకుపడ్డారు. తక్షణం ఎస్సీ వర్గానికి చెందిన మైనర్ బాలికకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు మరోసారి డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు పట్టణంలో వైసీపీ వారు హత్య చేసిన బీసీ వర్గానికి చెందిన తెదేపా నేత నందo సుబ్బయ్య ను హత్య చేసినప్పటికి, అసలు దోషులను అరెస్టు చేయలేదని, చాపాడు మండలం అయ్యవారిపల్లి సర్పంచ్, మైనారిటీ వర్గానికి చెందిన రoతుల్లా, వారి కుటుంబ సభ్యుల పై హత్యాయత్నం చేస్తే 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయకుండా పోలీసులు కేసును నిర్వీర్యం చేశారని, నిందితులను ఇంతవరకు అరెస్టు చేయలేదని తక్షణం వీటి పై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మైనర్ బాలిక పై హత్యాయత్నం చేసిన నిందితుడిని రెండు, మూడు రోజుల్లో అరెస్టు చేయడంతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయకపోతే తెదేపా తరపున ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ రెడ్యo చంద్రశేఖర్ రెడ్డి, తెలుగు మహిళా కడప పార్లమెంటు ప్రధాన కార్యదర్శి శ్రీమతి కోటా శ్రీదేవి , తెదేపా నేతలు నల్లబోతుల నాగరాజు, తాటి శీను, గుర్రప్ప యాదవ్, సి. సిద్దయ్య, అంకిరెడ్డిపల్లె రామసుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.