పన్నులు చెల్లించకపోతే అభివృద్ధి ఎలా సాధ్యం
గూడూరు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు
పన్నులు చెల్లించకపోతే అభివృద్ధి ఎలా సాధ్యం :
గూడూరు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు
గూడూరు , మార్చి 21, ( సీమకిరణం న్యూస్) :
ప్రజలు కులాయి పన్నులు డిపాజిట్లు చెల్లించకపోతే మున్సిపాలిటీ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం స్థానిక సంజీవయ్య నగర్ కాలనీకి చెందిన ప్రజలు తమ కుళాయిలకు ఏర్పాటు చేసిన బిరడాలను తొలగించి నీటి సరఫరాను కొనసాగించాలని మున్సిపల్ చైర్మన్, కమిషనర్ లను కోరారు. తాము పూట గడవని పరిస్థితులలో ఉన్నామని గత కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న కుళా యిలకు ఇప్పుడు డిపాజిట్లు చెల్లించమని నోటీసులివ్వడం సమంజసం కాదన్నారు. బిజెపి మండల నాయకులు మల్లేష్ నాయుడు,హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా ప్రముక్ సురేష్ లు మాట్లాడుతూ నిరుపేదలైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలను కులాయి డిపాజిట్లు చెల్లించాలని వాటిని తొలగించడం సరైంది కాదని అధికారులను నిలదీశారు. వెంటనే వారికి యధాతధంగా నీటి సరఫరాను చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటికి సంబంధించి లక్షల్లో బకాయిలు ఉన్నాయని కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు చెల్లించలేకపోతున్నామని తెలిపారు. చాలా మంది డిపాజిట్లు చెల్లించకుండా కుళాయిలను ఏర్పాటు చేసుకుని పన్నులు చెల్లించడంలేదని తెలిపారు. ఇంటి మరియు కొళాయి పన్నులను వసూలు చేయకపోతే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం కాదని ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. కులాయి డిపాజిట్ల తగ్గింపు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి మరియు కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఏఈ నరసింహులు, కాలనీ ప్రజలు, సిబ్బంది ఉన్నారు.