పార్టీలో పుకార్లకు అధినాయకత్వం చెక్ పెట్టాలి
కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
పార్టీలో పుకార్లకు అధినాయకత్వం చెక్ పెట్టాలి
-: టి.జి భరత్
కర్నూలు టౌన్, మార్చి 24, (సీమకిరణం న్యూస్) :
తెలుగుదేశం పార్టీలో కొద్ది రోజులుగా వస్తున్న పుకార్లపై అధినాయకత్వం స్పందించాలని కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని మౌర్య ఇన్ లో కర్నూలు పార్లమెంటరీ దళిత ప్రతిఘటన సదస్సు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కర్నూలు నియోజక వర్గంలో పార్టీ బలంగా ఉందన్నారు. గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోనే రెండవ స్థానం లో కర్నూలు మున్సిపాలిటీని నిలిపానని.. 9 కార్పోరేటర్ స్థానాల్లో విజయం సాధించడంతో పాటు మరో 14 స్థానాలు తక్కువ ఓట్ల తేడాతో కోల్పోయామని గుర్తు చేశారు. పార్టీ అధికారంలో లేకపోయినా తనపై ఉన్న బాధ్యతను నెరవేర్చినట్లు చెప్పారు. పార్టీలో వస్తున్న పుకార్లకు అధిష్టానం చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో అభిమానం, ఓటు బ్యాంకు కలిగిన వాడే నాయకుడవుతాడన్నారు. కర్నూలు ప్రజలు టి.జి ఫ్యామిలీవైపు ఉన్నారని చెప్పారు. తాము ఏ పార్టీ లో ఉన్నా తమకంటూ సపరేటు ఓటు బ్యాంకు ఉందన్నారు. చంద్రబాబుపై ఉన్న అభిమానంతోనే పార్టీలో కొనసాగుతున్నట్లు చెప్పారు. ఇక కర్నూలు నగరంలో కుల మతాలతో సంబంధం లేకుండా అందరినీ ఆదరించే ఫ్యామిలీ తమదే అన్నారు. తమ కంపెనీలో సైతం అన్ని వర్గాల వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇక దళితులంటే తమకు ఎంతో గౌరవమని.. వారికి కూడా తమపై చెప్పలేనంత అభిమానం ఉందన్నారు. ఇక ఎన్నికల సమయంలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. నాయకుడు బాగుంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇక గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు తరువాతి ప్రభుత్వం కొనసాగించాలన్నారు. గతంలో వైఎస్సార్ తీసుకొచ్చిన పథకాలు చంద్ర బాబు కొనసాగించారని గుర్తు చేసిన భరత్ వైసీపీ ప్రభుత్వం మంచి పథకాలు పక్కన పెట్టేసింద న్నారు. ఈ ప్రభుత్వంలో సబ్ ప్లాన్ నిధులు రాలే దన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఉద్యోగాల ఖాలీలు సైతం ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు.