వడగాల్పుల పట్ల అప్రమత్తంగా వుండండి
కర్నూలు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు
వడగాల్పుల పట్ల అప్రమత్తంగా వుండండి
జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు
కర్నూలు కలెక్టరేట్, మార్చి 24, (సీమకిరణం న్యూస్):-
జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రతరమవుతున్న దృష్ట్యా ప్రజలు వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
వడదెబ్బకు గురికాకుండా రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఈ క్రింది సూచనలు జారీ చేసిందన్నారు.
ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నెత్తికి టోపీ పెట్టుకోండి లేదా రుమాలు కట్టుకోండి. తెలుపు రంగు కల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి.
తీవ్రమైన ఎండలో బయటికి వచ్చినప్పుడు తల తిరుగుట, వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గర్లోని వైద్యులను సంప్రదించండి.
తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం కలిగి ఉండడం, మత్తు నిద్ర, ఫిట్స్ పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి ఉన్నట్లయితే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
వీలు అయినంత వరకు ఇంటిలో వుండటానికి ప్రయత్నిచండి. దాహం వేయకపోయినా తరచూ నీటిని త్రాగుతూ ఉండాలి.
ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగుతూ ఉండాలి.
వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రాకపోతే దగ్గరి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించండి.
ఎండల నుండి వచ్చిన వెంటనే నీరు కానీ నిమ్మరసం కానీ కొబ్బరి నీళ్ళు తాగాలి.
ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోండి. ఫ్యాన్లు వాడండి.. చన్నీటి స్నానం చేయండి.
తక్కువ ఖర్చుతో కూడిన చల్లదనం కోసం ఇంటి పైకప్పులపై వైట్ పెయింటింగ్, రూఫ్ టెక్నాలజీ, ధర్మకోల్ ఇన్సులేషన్ ను ఉపయోగించండి.
మేడపైన మొక్కలు ఇంటిలోని మొక్కలు భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిధంగా ఉష్ణ తాపాన్ని కూడా తగ్గిస్తాయి.
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి
ఎండలో గొడుగు లేకుండా తిరగరాదు. వేసవికాలంలో నలుపురంగు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.
మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్య కాలంలో బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులు చేయరాదు.
బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు. వీరిపై ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది.
శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ,కాఫీ మరియు కార్పొరేట్ శీతలపానీయాలు, అధిక ప్రోటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే పదార్థాలను తీసుకోవద్దు.
ప్రకాశించే బల్బులను వాడటం మానుకోండి. అవి అనవసరమైన వేడిని విడుదల చేస్తాయి.