28,29 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

28,29 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
డోన్ టౌన్, మార్చి 24, (సీమకిరణం న్యూస్) :
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28,29 న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సి ఐ టి యు పట్టణ,మండల కార్యదర్శులు టి.శివరాం,పి.రామాంజనేయులు పిలుపునిచ్చారు.గురువారం స్థానిక సీఐటీయు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం మండల అధ్యక్షుడు బి.నాగ మద్దయ్య అధ్యక్షతన జరిగింది.కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలైన దేశ సంపదను కార్పోరేట్ శక్తులైన అదానీ, అంబానీలకు కారు చౌకగా కట్టబెడుతూ వారికి ఊడిగం చేస్తున్నాడు అని ధ్వజమెత్తారు.మరోవైపు లాభాలలో నడుస్తున్న ఎల్ఐసి,దేశ భద్రతకు సంబంధించిన రక్షణ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడం సిగ్గుచేటన్నారు.కార్మికులు పోరాడి ప్రాణ త్యాగాల తో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మిక ప్రయోజనాలను తుంగలోతొక్కి,యాజమాన్యాలకు అనుకూలంగా కేవలం నాలుగు కోడ్ లుగా చట్టాలు చేయడం దుర్మార్గం అన్నారు.పెట్రోల్,డీజిల్ ధరలను పెంచుతూతద్వారా అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు కారణం అవుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని,సబ్సిడీలను ఎత్తివేసి అమాంతం గ్యాస్ ధరలను పెంచుతూ అక్కా,చెల్లెమ్మల కంట కన్నీరు తెప్పిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.కరోనా కష్టకాలంలో ఉపాధి అవకాశాలు కోల్పోయి సామాన్యులు పస్తులతో అలమటిస్తూంటే అదానీ, అంబానీల ఆస్తులు ఏమో లక్షల కోట్లు పెరగడం మోడీ ప్రభుత్వ ఘనతేనని ఎద్దేవా చేశారు.పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు,ఉపాధి అవకాశాలు లేక వ్యవసాయ కూలీలు,ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు,ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.యుటిఎఫ్ జిల్లా నాయకులు మాణిక్యం శెట్టి,సిపిఎం సీనియర్ నాయకులు జి.కొండయ్య,సిపిఎం పట్టణ,మండల కార్యదర్శులు నక్కీశ్రీకాంత్,కోయిలకొండ నాగరాజు,మోటర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిన్న రహిమాన్,వివోఎ సంఘం అధ్యక్షులు మధుసూదన్ నాయుడు,వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు రామచంద్రుడు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ బస్సు యూనియన్ నాయకులు గోపాల్,ఆర్టీసీ హైయర్ బస్సు యూనియన్ నాయకులు సుబ్రమణ్యం,వివో ఎ ల సంఘం నాయకులు గుండాలయ్య,లక్ష్మణ్,ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు సూరన్న,బాలు, కాకానీ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.