వైభవంగా శ్రీలక్ష్మీమాధవుడి రథోత్సవం
వైభవంగా శ్రీలక్ష్మీమాధవుడి రథోత్సవం
కోడుమూరు టౌన్, మార్చి 24, (సీమకిరణం న్యూస్) :
జిల్లాలో ఎంతో ప్రసిద్ధి గాంచిన గోరంట్ల శ్రీ లక్ష్మీ మాధవుడి రథోత్సవ కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా కన్నుల పండువగా సాగింది.మండలంలోని గోరంట్ల గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత శ్రీమాధవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం రథోత్సవ కార్యక్రమం అశేష జనవాహిని మధ్య వైభవంగా జరిగింది.ఈవో సుబ్రమణ్యం నాయుడు ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారి ఆలయంలో కొలువుదీరిన స్వామి,అమ్మవార్లకు వేదపండితులు,ఆలయ అర్చకులు వందవాసి రాధాకృష్ణాచార్యలు తదితరులు ఆగమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.అనంతరం రథాన్ని గజమాలలు,వివిధ రకాల పూలమాలలతో అందంగా అలంకరించారు. సాయంత్రం రథంపై ఉత్సవమూర్తులు శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ మాధవస్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను వేంచింపజేయించి వారికి ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చి రథోత్సవాన్ని భక్తుల గోవిందా..గోవింద నామస్మరణల మధ్య ముందుకు లాగారు.రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు.రథంపై విహరిస్తున్న శ్రీదేవి భూదేవి సహిత శ్రీమాధవస్వామి వార్లను చిలికిస్తూ భక్తులకు నయనానందం పొందారు.రథోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే టిడిపి నాయకులు కోట్ల సుజాతమ్మ,మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు వేరు వేరుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు,టీడీపీ నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.అలాగే కోట్ల కవితమ్మ,కోట్ల కౌషిక్ రెడ్డిలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే రథోత్సవం సందర్భంగా ఉదయం కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి,జడ్పీటీసీ రఘునాథరెడ్డి తదితర వైసిపి నాయకులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ వి శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు విష్ణునారాయణ,శివాంజల్, నారాయణరెడ్డి,బాలనర్సింహులు పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.