వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు
-రేంజర్ శ్రీపతి నాయుడు.
చాగలమర్రి, మార్చి 24, (సీమకిరణం న్యూస్) :
నల్లమల్ల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడి చంపిన, వృక్షాలు నరికిన కఠిన శిక్షలు తప్పవని రుద్రవరం అటవీ శాఖ రేంజర్ శ్రీపతి నాయుడు హెచ్చరించారు. గురువారం చాగలమర్రి లోని అటవీశాఖ క్వార్టర్స్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడితే ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా, అడవిలో చెట్లను నరికితే రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష,రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తారు అని స్పష్టం చేశారు. వన్యప్రాణులను చంపడం వల్ల, చెట్లు నరకడం వల్ల సమతుల్యం దెబ్బతింటుంది ఆయన తెలిపారు. కృష్ణ జింకలు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని ఎవరైనా రైతులు వాటిని చంపేస్తే కేసులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అటవి జంతువులు పంటలను నాశనం చేసినట్టు తమ దృష్టికి తీసుకొని వస్తే రైతులకు పంట నష్ట పరిహారం ప్రభుత్వం నుంచి అందించుటకు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అడవుల్లో నిప్పు పెట్టడం కూడా నేరం అవుతుందని ఇలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. నల్లమల అడవి ప్రాంతం లోకి ప్రవేశించడం నిషేధించబడింది అని ఆయన తెలిపారు. బేస్ క్యాంపులు తమ సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించడం వల్ల గత రెండు సంవత్సరాల నుండి రిజర్వ్ ఫారెస్ట్ లో స్మగ్లింగ్ లేదని ఆయన తెలిపారు. నల్లమల అడవి సంపద ను కాపాడుటలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఫారెస్టర్ కిషోర్ కుమార్,యఫ్ బి ఓ లు నాగేష్, సుభాష్, మదన్ గోపాల్ లు పాల్గొన్నారు.