
రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది
కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో దేవాలయాలకు పూర్వ వైభవం
రాష్ట్రంలో 1058 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.846 కోట్లు మంజూరు
రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
కర్నూలు ప్రతినిధి, డిసెంబర్ 13, (సీమకిరణం న్యూస్) :
అభివృద్ధి,సంక్షేమం, పారిశ్రామికం, ఆధ్యాత్మికం అన్నింటిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం కర్నూలు నగరంలో రూ. 4.25 కోట్ల వ్యయంతో నిర్మించిన దేవాదాయ శాఖ కర్నూలు జోన్ పరిపాలనా కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టి.జి భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ హెడ్ ఆఫీస్ విజయవాడలో గొల్లపూడిలో ఉన్నట్లు గానే, రాయలసీమకు కర్నూలులో ఈ ఆధ్యాత్మిక భవనం ఏర్పాటు చేయడం అత్యంత సంతోషదాయకం అని పేర్కొన్నారు. ఈ కార్యాలయ సముదాయంలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయంతో పాటు ఇంజనీరింగ్, తదితర కార్యాలయాలు సముదాయాలు కూడా ఉన్నాయని, నూతన కార్యాలయం కర్నూలు నుండి కాణిపాకం పనిచేస్తుందన్నారు.
ఆలయాల్లో పూజా కైంకర్యాలు, ఉత్సవాలు ఆగమ శాస్త్ర పండితులు, వేద పండితుల నిర్ణయాలు మేరకే జరుగుతాయన్నారు.. పురాతన ఆలయాలు, వాటి కట్టడాలను సంరక్షించే విధంగా ఈ శాఖ పని చేస్తుందని మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన హామీల్లో దేవాదాయ శాఖలో 98 శాతం నెరవేర్చాం అని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 2372 మంది అర్చకులకు కనీస వేతనం కింద ప్రతి నెల రూ.15వేలు ఇస్తున్నామన్నారు. వేద విద్య నేర్చుకున్న 599 మంది అర్హులైన వేద పండితులకు సంభావన కింద నెలకు రూ.3 వేలు ఇవ్వడం జరుగుతోందన్నారు.
ఆలయాల్లో పని చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు రూ. 25 వేల చొప్పున వేతనం ఇస్తున్న ప్రభుత్వం తమది అని మంత్రి పేర్కొన్నారు. ఆలయాల ట్రస్ట్ బోర్డులో పాలకవర్గంలో బ్రాహ్మణుల్లో ఒకరిని, నాయీ బ్రాహ్మణుల్లో ఒకరిని సభ్యులుగా చేర్చేందుకు చట్టం తెచ్చామన్నారు. రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద ఆలయాలన్నింటిని టూరిజం సర్క్యూట్ కింద చేర్చి, టెంపుల్ టూరిజం ను రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. డిప్యూటీ సీఎం, టూరిజం శాఖామంత్రి, దేవాదాయ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. దేవాదాయ ఆస్తులను, ఆలయ భూములను పరిరక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసి ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రాష్ట్రంలో 21 ఆలయాల్లో ప్రతినిత్యం అన్నప్రసాద వితరణ జరుగుతోందని, 74 ఆలయాల్లో వారానికి ఒకరోజు, రెండు రోజులు అన్నప్రసాద వితరణ చేస్తున్నామని మంత్రి తెలిపారు. 11 ఆలయాల్లో రాష్ట్ర పండుగలు నిర్వహిస్తున్నామని, ఇందులో వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయాన్ని చేర్చి రాష్ట్ర పండుగలు నిర్వహిస్తున్నామన్నారు. 20 ఆలయాల్లో 3700 గోవులను సంరక్షిస్తున్నామని, మూడు వేద పాఠశాలలు, ఏడు ఆగమ పాఠశాలల్లో 400 మంది విద్యార్థులకు వేదం నేర్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ధూపదీప నైవేద్యం కింద 2021 నుండి రూ.5వేల నుండి 10 వేలకు పెంచి రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నామని, 5821 ఆలయాల్లో ప్రతినెల రూ.10 వేల చొప్పున పూజారి అకౌంట్లో ఈ మొత్తాన్ని జమ చేస్తున్నామని మంత్రి వివరించారు. పురాతన ఆలయాల పునర్నిర్మాణం కోసం కామన్ కింద నిధులను మంజూరు చేసి పనులను చేపట్టడం జరుగుతోందన్నారు.. రాష్ట్రంలో 1058 ఆలయాలలో పునర్నిర్మాణ పనులు మరియు గతంలో ఆపేసిన పనులన్నింటికీ రూ. 846 కోట్లు నిధులు మంజూరు చేశామని, ఒకటి, రెండు ఏళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యం లో దేవాలయాలకు పూర్వ వైభవం వస్తోందని మంత్రి తెలిపారు. కర్నూలు జిల్లాలో 153 ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల కోసం రూ.18.36 కోట్లు, ఆలయాల పునర్నిర్మాణ పనుల కోసం రూ.14 కోట్లు, నంద్యాల జిల్లాలో 39 ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు రూ. 37.8 కోట్లు, ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ.50.12 కోట్లు, అనంతపురం జిల్లాలో ధూపదీప నైవేద్యాల కోసం 58.32 కోట్లు, ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ. 26.40 కోట్లు మంజూరు చేయడం జరిగిందని మంత్రి వివరించారు..
ఘనంగా గోదావరి, కృష్ణా పుష్కరాలు
రాష్ట్రంలో గోదావరి కృష్ణ పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు..2027 జూన్ 26 నుంచి జూలై ఏడవ తేదీ వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఆగమ పండితులు, వేద పండితులు తేదీలను నిర్ణయించడం జరిగిందని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి.. పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.. త్వరలో ఈ అంశంపై చీఫ్ సెక్రటరీ, ఇతర శాఖల కార్యదర్శిలు హెచ్ఓడీలతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పుష్కరాల నిర్వహణ లో భాగంగా కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి తదితర ప్రాంతాల్లోని 31 ఆలయాల్లో పనులు మంజూరు చేశామని, వీటిని మొదలుపెట్టడం జరుగుతుందన్నారు. 2028 లో కృష్ణా నది పుష్కరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఘనంగా జరిగాయని, అదే విధంగా ఈ సారి కూడా పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.




