
ప్రజలందరూ ‘పురమిత్ర’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు ప్రతినిధి, జనవరి 22, (సీమకిరణం న్యూస్):
నగర పౌరులు అరచేతిలో నగరపాలక సేవలు పొందవచ్చని నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాల ప్రజల సౌకర్యార్థం, స్థానిక సమస్యలకు సులువుగా పరిష్కారం పొందేందుకు వీలుగా ‘పురమిత్ర’ యాప్ను రూపొందించిందని తెలిపారు. నగరపాలకకు సంబంధించిన సమస్త సేవలను కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా, సులువుగా ‘పురమిత్ర’లోనే సకల సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ఇళ్లలో చెత్త సేకరణ, ఇంటి పన్ను చెల్లింపు, ప్రజారోగ్యం, దోమలు, కుక్కల బెడద, రహదారులపై గుంతలు వంటి మొత్తం 119 రకాల సేవలు పురమిత్ర యాప్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీనిని ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని, “PuraMitra” అని టైప్ చేస్తే యాప్ లభిస్తుందని తెలిపారు. ఫిర్యాదులను టైప్ రూపంలోనూ లేదా వాయిస్ రూపంలోనూ పంపేందుకు అవకాశం ఉందని, సమస్య ఫోటో తీసి జతచేస్తే అది ఆటోమేటిక్గా ఏఐ సాంకేతికత ద్వారా సంబంధిత ప్రాంతానికి చెందిన అధికారికి చేరుతుందని వివరించారు. ఈ యాప్ను పౌరులందరు వెంటనే డౌన్లోడ్ చేసుకుని నగరపాలక సేవలు సులువుగా పొందాలని కమిషనర్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత, తాగునీరు, లైటింగ్, డ్రైనేజీ సమస్యలు, రోడ్లపై గుంతలు వంటి అంశాలను ఈ యాప్ ద్వారా తెలియజేస్తే మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.




