వాహనాలు నడిపేవారు వాహన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన
కర్నూలు ప్రతినిధి, జనవరి 31, (సీమకిరణం న్యూస్):
రోడ్ల పైన వాహనాలు నడిపేవారు వాహన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పేర్కొన్నారు. బుధవారం జాతీయ రహదారి భద్రత మాసోత్సవల సందర్భంగా కలెక్టరేట్ నుండి సి క్యాంపు సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్.జి.సృజన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన మాట్లాడుతూ రోడ్ల పైన వాహనాలు నడిపేవారు వాహన చట్టాలపై ఖచ్చితముగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రోడ్ల పైన వాహన ప్రమాదాలను నివారించుట కొరకే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 20వ తారీకు నుండి ఫిబ్రవరి 19 వ తారీకు వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తుందన్నారు, ఇందులో భాగంగా ఈరోజు వాహన చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు కలెక్టరేట్ నుండి సి క్యాంపు వరకు అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. రోడ్లపై వాహనాలు నడిపే వారిలో ఎక్కువ శాతం యువతకే ఫైన్ లు పడుతున్నాయి అని అన్నారు. డ్రైవింగ్ పై మక్కువ ఉండవచ్చును కాని డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాహన చట్టాలను పాటించాలన్నారు. యువత 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్ పొందవలసి ఉంటుంది. కొంతమంది యువత 18 సంవత్సరములు నిండకముందే బైకులో రోడ్ల పైన విన్యసాలు చేస్తూ వారు ఇబ్బంది పడడమే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నారు. అలా చేయడం చట్టరీత్యా నేరం అన్నారు. రోడ్ల పైన వాహనాలను నడుపుతూ సెల్ఫోన్ మాట్లాడకూడదని, ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఇలా చేయడం వల్ల అనర్ధాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉందన్నారు. కావున యువత వాహన చట్టాల నియమాలు పాటిస్తూ క్షేమంగా గమ్యానికి చేరుకోవాలని వాహన చట్టాలను గురించి ఇతరులకు కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ర్యాలీని నిర్వహించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. డిటిసి శ్రీధర్ మాట్లాడుతూ ముందుగా మాసోత్సవాల షెడ్యూల్‌ను వివరించారు. వాహన చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమంది కుటుంబ యజమానులు, యువకులు అర్ధాంతరంగా మరణిస్తుండటం వల్ల ఆయా కుటుంబాలు రోడ్డున పడటమే కాకుండా, వారికి తీరని శోకాన్ని మిగిలిస్తున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ప్రతీఏటా రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించి, అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు కలెక్టరేట్ నుండి బయలుదేరిన ర్యాలీ సి క్యాంపులో మానవహారంగా ఏర్పడి ర్యాలీలో పాల్గొన్న వారిచే వాహన చట్టాలపై ర్యాలీలో పాల్గొన్న వారిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో రమేష్, ట్రాఫిక్ డిఎస్పి నాగభూషణం, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ,డ్రైవింగ్ స్కూల్స్ , ఆటో రిక్షా,టాక్సీ , ప్రైవేటు బస్సుల, లారీల డ్రైవర్లు, వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.