మత్తుపదార్థాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టండి
జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
కర్నూలు కలెక్టరేట్, జూన్, 14, (సీమకిరణం న్యూస్) :
మత్తుపదార్థాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో మత్తుపదార్థాల నియంత్రణపై జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, సెబ్ అదనపు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్తుపదార్థాల నియంత్రణలో భాగంగా వాటికి అలవాటు అయిన వారిని కుటుంబ డాక్టరు విధానం ద్వారా ఇంటింటికి వైద్యం అందించే వైద్య సిబ్బంది గుర్తించి వారికి అవసరమైన వైద్య సదుపాయం అందజేయాలని జిల్లా వైద్యాధికారిని కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయిలో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించుకొని వారికి అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేటు వాహనాల ద్వారా మత్తు పదార్థాల రవాణా జరిగే అవకాశం ఉంటుందని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీధర్ ను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా బస్సులలో పార్సెల్ సర్వీసుల ద్వారా రవాణా చేసే వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్టీసి ఆర్ఏంను ఆదేశించారు. విద్యా శాఖకు సంబంధించి అన్ని పాఠశాలలు, కళాశాలలు, సచివాలయాల యందు మత్తుపదార్థాల వాడకం వల్ల జరిగే అనర్థాలను సూచిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ మాట్లాడుతూ మత్తు పదార్థాల రవాణాకు సంబంధించి కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు ఇచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఎక్కువ శాతం ఇతర ప్రాంతాల నుండి భవన నిర్మాణ పనులకు వచ్చే వారే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని, అందుకు గాను వారికి కూడా వాటి పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ఎస్సీ/ఎస్టీ సెల్ డిఎస్పీ యుగంధర్ బాబు జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ ఇప్పటి వరకు సుమారు 74 కళాశాలలోని విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించామన్నారు. పోలీసులు కూడా గ్రామాలలో పల్లెనిద్రకు వెళ్ళినపుడు అక్కడి గ్రామస్తులకు కూడా వాటి పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎక్కువ శాతం యువత మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారని వారిపై ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా మెడికల్ షాపుల నందు కూడా మత్తుకు సంబంధించిన మందులు ఇచ్చే సమయంలో సంబంధిత సిబ్బంది తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు అందజేయాలన్నారు. వైట్నర్స్ వల్ల కూడా ఎక్కువ శాతం యువత మత్తుకు బానిస అవుతున్నారని జిల్లా కలెక్టర్ కు తెలుపగా వైట్నర్స్ అమ్మే స్టేషనరీ షాపులలో ఎంత మేరకు వైట్నర్స్ కొన్నారు ఎంత మేరకు అమ్మకాలు జరిగాయి తదితర వివరాలను పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో మున్సిపల్ కమీషనర్, మండల స్థాయిలో ఎంపిడిఓలు స్టేషనరీ షాపుల యజమానుల నుంచి వివరాలు సేకరించేలా ఆదేశాలు ఇస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగేశ్వరరావు, కర్నూలు ఆర్డీఓ హరి ప్రసాద్, పత్తికొండ ఆర్డీఓ మోహన్ దాస్, ఎస్టీ/ఎస్సీ సెల్ డిఎస్పీ యుగంధర్ బాబు, జిల్లా వైద్యాధికారి డాక్టరు రామ గిడ్డయ్య, డిఎఫ్ఓ పి.శివశంకర్ రెడ్డి, అసిస్టెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ రమాదేవి, రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీధర్, ఆర్టీసీ ఆర్ఎం రామం, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.