
నగరంలో చైన్ స్నాచింగ్..!
కర్నూలు క్రైమ్, జనవరి 23, (సీమకిరణం న్యూస్):
కర్నూలు శివారులోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగింది. గడి వేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన శివ వీరేశ్వరరెడ్డి గణేష్ నగర్-2లో నివాసముంటాడు. ఈయన స్వగ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నేళ్లుగా కర్నూలులో నివాసముంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన భార్య మంగమ్మ నన్నూరుకు వెళ్లేందుకు ఇంటి నుంచి నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ మీదుగా నంద్యాల చెకోపోస్టు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని యువకుడు హోండా స్కూటీపై ఎదురుగా వచ్చి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కున్నాడు. ఆమె అప్రమత్తమై దొంగ.. దొంగ.. అంటూ కేక వేసేలోగా వాహన వేగాన్ని పెంచి పక్క సందులోకి నుంచి పరారయ్యాడు. బాధితురాలు మూడో పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ శేషయ్య ఆదేశాల మేరకు క్రైం పార్టీ సిబ్బంది ఆ ప్రాంతం లోని సీసీ కెమెరాల్లో ఫుటేజీని సేకరించి దొంగను గుర్తించే పనిలో ఉన్నారు.