రమణీయం… గిడ్డాంజనేయ స్వామి రథోత్సవం
రమణీయం… గిడ్డాంజనేయ స్వామి రథోత్సవం
పెద్దకడబూరు, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
కొలిచే భక్తుల పాలిట మహిమాన్వితులుగా వెలుగొందుతున్న మండలం లోని తారాపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ గిడ్డాంజనేయ స్వామివారి మహారథోత్సవం ఆలయ అధికారి రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం అశేష భక్తవాహిణి నడుమ రమ ణీయంగా జరిగింది. ఉదయం స్వామివారికి ఆలయ అర్చకు లు బసవరాజు, నాగరాజు స్వాములు ప్రభాత పూజ, అభిషేకార్చన, మహానీరాజనం, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు స్వామివారి కుంభం, కలసాన్ని వీరారెడ్డి ఇంటి నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అత్యంత సుందరంగా అలంకరించిన స్వామి రథం వద్దకు తెచ్చారు. రథాన్ని అలంకరించేందుకు గజ మాలను గ్రామ పెద్దలు భీంసేనరావు కౌశిక్ ఇంటి నుండి ఊరేగింపుగా తెచ్చి అలంకరించారు. గిడ్డాంజనేయ స్వామి ఆలయం నుండి ఉత్సవ మూర్తులను రథం వద్దకు తెచ్చారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి అశేష భక్తవాహిణి నడుమ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు
శ్రీ గిడ్డాంజనేయస్వామి రథోత్సవాన్ని పురస్కరించుకొని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు ప్రదీప్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, పెద్దకడబూరు ఉపసర్పంచ్ విజేయేంద్రరెడ్డి, గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవమ్మ, ఎంపీటీసీ అనిత, గ్రామ పెద్ద భీంసేనరావు కౌశిక్, వైసీపీ బీసీ నాయకులు జాము మూకన్న స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ శ్రీనివాసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవంలో చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి మొక్కు తీర్చుకొన్నారు.