కర్నూలు విమానాశ్రయం భద్రత, నిర్వహణ నిబంధనల ప్రకారం పక్కాగా జరగాలి
జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు
కర్నూలు కలెక్టరేట్, మే 25, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు విమానాశ్రయ భద్రత, నిర్వహణ నిబంధనల ప్రకారం పక్కాగా జరగాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు ఎయిర్పోర్ట్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఓర్వకల్ విమానాశ్రయం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏరో డ్రోమ్ కమిటీ మరియు ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి,మునిసిపల్ కమిషనర్ భార్గవ్ తేజ్,ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ ,ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్టుకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. నిబంధనల ప్రకారం ఎయిర్ పోర్ట్ లో యాంటీ హైజాక్ మాక్ ఎక్సర్సైజ్, బాంబ్ త్రెట్ మాక్ ఎక్సర్సైజ్ ను నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రన్ వే విస్తరణకు సంబంధించి నిర్దేశించిన భూమిని సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని కర్నూలు ఆర్డీవో, ఓర్వకల్లు తహసీల్దార్ లను ఆదేశించారు.. ఎయిర్ పోర్ట్ అప్రోచ్ రోడ్ పై బైక్ రేసింగ్, ఫోటో, వీడియో షూట్ లు, మద్యం సేవించి తిరిగే వారి వల్ల ప్రయాణీకులకు, ఉద్యోగులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు తరచుగా పెట్రోలింగ్ నిర్వహించేలా పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు, స్థానికంగా అంతర్జాతీయ భాషలు తెలిసిన వారిని గుర్తించి వారి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఫైర్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల పొలాలు ఉన్న రైతులతో సీజనల్ గా అవగాహనా సమావేశాలు ఏర్పాటు చేయాలని ఓర్వకల్లు తహసీల్దార్ ను ఆదేశించారు. అవసరమైన సమయాల్లో వైద్య సహాయం అందించడానికి వీలుగా ఎయిర్ పోర్ట్ కు అటాచ్ చేస్తూ తగిన వైద్య సిబ్బంది, అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయాలని డిఎంఅండ్హెచ్ఓ రామ గిడ్డయ్య ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ రన్ వే పై క్రాష్ ఫైర్ టెండర్ వాహనంలో వెళ్లి క్రాష్ గేట్ల ను పరిశీలించారు. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయాల్లో ఈ వాహనం ద్వారా తీసుకోవలసిన చర్యలను పరిశీలించారు. ఈ సమావేశంలో ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ మధుసూదన్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జయసింహ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ ముని ప్రసాద్, ఆర్డీవో హరి ప్రసాద్,పోలీస్, బిఎస్ఎన్ఎల్ , NSG task force ఎయిర్పోర్టు అధికారులు, indigo అధికారులు, తదితరులు పాల్గొన్నారు.