పిల్లలు పనుల్లో కాదు, బడుల్లో ఉండాలి
జూనియర్ సివిల్ జడ్జి గురు అరవింద్
ఎమ్మిగనూరు టౌన్, జూన్ 12, (సీమకిరణం న్యూస్) :
బడిలో ఉండాల్సిన పిల్లలను,ఆట పాటలతో గడపాల్సిన బాల్యాన్ని బంధి చేయడం ఒక అనాగరిక చర్య. ఇప్పటికి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటి అని ఎమ్మిగనూరు జూనియర్ సివిల్ జడ్జి గురుఅరవింద్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో వెంకటాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. నేడు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని వారు మాట్లాడుతూ కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారని పరిశ్రమలు, వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగం, సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారని అన్నారు. పిల్లల తల్లిదండ్రుల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యతల కారణంగానే బాలకార్మికులు పెరిగిపోతున్నారని, కనీస అవసరాలకు సరిపడా ఆదాయం దొరకని అనేక కుటుంబాలు తమ పిల్లల్ని పనుల్లో చేర్పిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
బాల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కనీసం ప్రాథమిక విద్య కూడా పొందకుండానే కార్మికులుగా మారుతున్నారు.యాజమాన్యాలు బాల కార్మికులతో ఎక్కువ పనిచేయిస్తూ, తక్కువ వేతనాలు ఇస్తున్నాయని, కొంతమంది బాలలు వారి సామర్త్యానికి మించిన పనుల్ని చేయాల్సి వస్తోందని, బాలకార్మికులు భౌతిక, లైంగిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు.ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు అమలవుతోందని దీనిలో భాగంగా పనుల్లో మగ్గుతున్న బాలల్ని గుర్తించి, వారికి సరైన ఆవాసం కల్పించి, విద్య అందిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యాహక్కు చట్టం సత్ఫలితాల్నిస్తోందని, ఏ కారణం చేతనైనా బాలలు బడి బయట ఉండరాదని, ప్రతి ఒక్కరికి నిర్బంధ ప్రాథమిక విద్య అందాలని ఈ చట్టం చెబుతోందని అన్నారు. బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లల్ని పనుల్లో పెట్టుకోకూడదు. దీన్ని అతిక్రమించిన వారికి జైలు శిక్షలతోపాటు జరిమానాలు విధిస్తారని తెలిపారు. పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ఎందరో బాలల భవిష్యత్‌ను చిదిమేస్తున్న కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అంతర్జాతీయ సమాజం కృషి చేస్తూనే ఉంది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించడం లేదని తెలిపారు.బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలని అన్నారు. బాలలతో పని చేయించుకునే యజమానులకు కఠిన శిక్షలు విధించాలని,బాలలందరికీ విద్య, పోషకాహారం అందేందుకు కృషి చేయాలని,ఈ పరిస్థితికి కారణమైన వ్యవస్థల్లో మార్పు తీసుకురావడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. పిల్లల్ని పనులు మాన్పించి, బడులలో చేర్పించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, వారి తల్లిదండ్రులు ఆర్థికంగా ఎదిగేందుకు సరైన అవకాశాల్ని కల్పించడం ద్వారా బాల కార్మికులు లేకుండా చూడొచ్చని, ఇలాంటి పిల్లలు చదువుకునేందుకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచిత విద్య, భోజనం అందిచాలని, తల్లిదండ్రుల సంరక్షణ లేని వారికి ప్రత్యేక రక్షణ, వసతులు కల్పించాలని వారు తెలిపారు.ఈ అవగాహన సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్నాథ్ రెడ్డి,కార్యదర్శి ఏసేపు,కోశాధికారి మురళీకృష్ణ, న్యాయవాదులు దామోదర్ రెడ్డి,నబీరసూల్, బి.శ్రీనివాసులు, కుమార్ లింగమూర్తి, రామమూర్తి
కోర్టు సిబ్బంది మహేశ్వరి, శ్రీనివాసులు,పోలీసు సిబ్బంది, తదితరులు హాజరయ్యారు.