
వక్ఫ్ బోర్డు సీనియర్ అసిస్టెంట్ మృతికి మంత్రి ఫరూక్ సంతాపం
అమరావతి, జనవరి 01, (సీమకిరణం న్యూస్):
ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు కేంద్ర కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న షేక్ మహమ్మద్ షైఫుల్లా (56) మృతికి రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం వక్ఫ్ బోర్డు కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ఉదయం 11:30 గంటల సమయంలో మహమ్మద్ షైఫుల్లా గుండెపోటుకు గురయ్యారు. సహచర సిబ్బంది వెంటనే అప్రమత్తమై చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా కోలుకోలేక షైఫుల్లా మృతి చెందినట్లు కార్యాలయం వర్గాలు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి ఫరూక్ జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఆరా తీశారు. షైఫుల్లా గుండెపోటుకు గురై మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతికి గురైనట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని సంతాపం వ్యక్తం చేస్తూ, షైఫుల్లా కుటుంబ సభ్యులకు మనోధైర్యం ను భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ మైనార్టీ సంక్షేమ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సంతాపం ప్రకటించారు.